ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ప్రయాణికుల సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని..సమ్మె విరమించేలా చర్యలు తీసుకోవాలని పిల్‌లో కోరారు. అలాగే, ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కమిటీ వేయాలని పిల్ వేసిన పిటిషనర్ కోరారు.సాయంత్రం 4 గంటలకు హౌస్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు హైకోర్టు అనుమతించింది.అందువల్ల హైకోర్టు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.
ఓవైపు ప్రభుత్వం ఆల్రెడీ ఈ సమ్మెపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఎట్టిపరిస్థితుల్లో సమ్మెను సమర్థించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టింది. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులు సైతం... సమ్మె విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్నారు.
తమ ఉద్యోగాలు ఊడిపోయినా సరే..తమ పోరాటం ఆగదంటున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను సానుకూల దృక్పథంతో ఒప్పుకోవాలని కోరుతున్నారు.ఇక తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె వరుసగా రెండో రోజూ కొనసాగుతోంది. దీంతో పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లేవారు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఇదే అదునుగా ప్రయివేట్ ట్రావెల్స్ జనాలను నిలువుదోపిడీ చేస్తున్నాయి. హైదరాబాద్ నగరం నుంచి స్వస్థలాలకు వెళ్లేవారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆర్టీసీ బస్సులో రూ.50 ఛార్జీతో వెళ్లే ప్రాంతాలకు ఇప్పుడు రూ.500 నుంచి రూ.700 వరకు ప్రయివేట్ ఆపరేటర్లు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ ఉద్యోగులు విధులకు హాజరుకాకపోవడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.పోలీసుల భద్రత నడుమ తాత్కాలిక డ్రైవర్ల సాయంతో పరిమిత సంఖ్యలో వాహనాలను నడుపుతున్నారు. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా.. అవి సరిపోవడం లేదు.
దాదాపు 50 వేలకు పైగా ఉద్యోగుల్లో ప్రభుత్వం ఇచ్చిన గడువులోపు శనివారం కేవలం 160 మంది ఉద్యోగులు మాత్రమే విధుల్లో చేరారు.ఇకపోతే ఈ రోజు అంటే ఆదివారం ఉదయం సమ్మె ఉదృతం కాగా, కనీసం నిన్న నడిచినన్ని బస్సులు కూడా నేడు కనిపించడం లేదు. రెండో రోజు వినూత్నంగా నిరసన తెలపాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించారు. డిపోల ఎదుట కుటుంబాలతో కలిసి సాయంత్రం బతుకమ్మ ఆడనున్నారు. అక్టోబరు 7న గన్‌పార్క్ వద్ద అమరులకు నివాళులర్పించి, ఇందిరా పార్కు వద్ద 15 మంది వరకు ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్నారట....
Comments
Post a Comment