ప్రజలు ఎవరికి ఓటు వేశారో తెలుసుకోవాలనుకుంటే తాము తెలుసుకోగలమంటూ బీజేపీ నేత బక్షిత్ సింగ్ విర్క్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాలో ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. 'బీజేపీలో అత్యంత నిజాయితీపరుడు ఈయనే' అంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన నిజాయతీగా ఈ విషయాన్ని ఒప్పుకున్నారనేలా ఎద్దేవా చేశారు.
కాగా, హర్యానాలోని అసంధ్ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన బహిరంగ సభలో బీజేపీ అభ్యర్థి బక్షిత్ సింగ్ విర్క్ మాట్లాడుతూ... ప్రజలు ఎవరు ఓటు వేసేందుకు వెళ్లినా తమకు తెలుస్తుందని అన్నారు. అలాగే, వారు ఎవరికి ఓటేశారో తెలుసుకోవాలనుకుంటే తాము తెలుసుకోగలమని, ఎందుకంటే ప్రధాని మోదీ, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చాలా తెలివైన వారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈవీఎంలలో ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు పడుతుందని అన్నారు. దీంతో ఇప్పటికే ఆయన ఈసీ నుంచి నోటీసులు అందుకున్నారు. కాగా, ఈ రోజు హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.
Comments
Post a Comment