Skip to main content

వచ్చే 60 రోజుల్లో మార్పు కనిపించాలి: సీఎం జగన్‌


రాష్ట్రంలో ఇసుక మాఫియా ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించకూడదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులు ఆదేశించారు. స్పందన కార్యక్రమంపై సమీక్షలో భాగంగా మంగళవారం సీఎం వైఎస్‌ జగన్‌ కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇసుక కొరతను తీర్చడానికి సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇసుక రవాణ చేస్తామంటూ ప్రభుత్వం నిర్దేశించిన ఛార్జీకు ఎవరు ముందుకు వచ్చినా వారిని ఆ బాధ్యతను అప్పగించాలన్నారు. కిలోమీటర్‌కు రూ.4.90 చొప్పున ఎవరు ముందుకు వచ్చినా రవాణా కోసం వాహనాలను ఎంపిక చేసుకోవాలని సీఎం సూచించారు. దీనిని అదునుగా తీసుకుని ఇసుక అక్రమ రవాణా జరగడానికి అవకాశం ఇవ్వద్దని అన్నారు.
సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలోని అన్ని ఇసుక రీచ్‌లను ఓపెన్‌ చేయండి. జిల్లాలో ఇసుక సరఫరా, రవాణా బాధ్యతలను జేసీ స్థాయి అధికారికి అప్పగించాలి. ఆ అధికారి కేవలం ఇసుక సరఫరా, రవాణాలను మాత్రమే చూడాలి. వరదలు తగ్గాయి, ఇసుక లభ్యత ఉంది. తక్కువ రేట్లకు అందించాలి. వచ్చే 60 రోజుల్లో కచ్చితంగా మార్పు రావాలి. ప్రతి జిల్లాలోని 2 వేలమంది నిరుద్యోగులైన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన యువకులు ఆయా కార్పొరేషన్ల ద్వారా, కాపు కార్పొరేషన్‌ కలుపుకుని వాహనాలు కొనుగోలు చేసేలా చూడాలి. వారికి ఇసుక రవాణా కాంట్రాక్టు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. దీనిపై మార్గదర్శకాలు తయారు చేయాలి. ఇదే సమయంలో ఇసుక అక్రమ రవాణా జరక్కుండా చూడాలి. కలెక్టర్లు, ఎస్పీలు దీనిపై దృష్టిపెట్టాలి. రాజకీయ జోక్యాన్ని ఎక్కడా కూడా అనునమతించరాదు. గత ప్రభుత్వానికీ, ఇప్పటి ప్రభుత్వానికీ తేడా కచ్చితంగా కనిపించాలి. ఇసుక మాఫియా ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించకూడదు. ఈ విషయంలో అధికారులకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నాను. మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుక సరఫరా ఉండకూడదు. చెక్‌పోస్టుల్లో గట్టి నిఘాను పెంచండి’ అని పేర్కొన్నారు.

Comments