Skip to main content

సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ... 4 కారణాలు ?

సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ... 4 కారణాలు ?



ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ భేటీ మర్యాదపూర్వకమే అని అంతా చెబుతున్నా... ఈ సమావేశం ఏపీ రాజకీయాల్లో సరికొత్త మలుపుగా మారబోతోందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. సైరా సినిమాను చూడాలని కోరేందుకే చిరంజీవి సీఎం జగన్‌ను కలవబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సమావేశంలో చిరంజీవి ముందు సీఎం జగన్... సీఎం జగన్ ముందుకు చిరంజీవి పలు ప్రతిపాదనలు పెట్టే అవకాశం లేకపోలేదనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అసలు సీఎం జగన్, చిరంజీవి సమావేశంలో పలు అంశాలు ప్రస్తావనకు రావొచ్చని తెలుస్తోంది.

సైరాకు పన్ను మినహాయింపు: చారిత్రక కథాంశంతో తెరకెక్కిన సైరా సినిమాను చూడటంతో పాటు ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలని చిరంజీవి సీఎం జగన్‌ను కోరే అవకాశం ఉందని సమాచారం. గతంలో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు ఏపీ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చిన అంశాన్ని చిరంజీవి జగన్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.

ఎమ్మెల్యే గంటా అంశం: టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరొచ్చని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా చిరంజీవి మార్గనిర్ధేశంలోనే ముందుకు సాగుతున్న గంటా శ్రీనివాసరావు అంశం కూడా జగన్, చిరంజీవి మధ్య భేటీలో చర్చకు రావొచ్చని సమాచారం.
రాజ్యసభ సీటు: సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ జరుగుతుందన్న విషయం తెలియగానే... మళ్లీ చిరంజీవి రాజకీయాల్లోకి రాబోతున్నారనే ప్రచారం కూడా మొదలైంది. కాంగ్రెస్ తరపున ఎంపీ అయిన చిరంజీవికి వైసీపీ తరపున రాజ్యసభ సీటు ఆఫర్ చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఇరువురి మధ్య భేటీలో ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
సినీ ఇండస్ట్రీకి రాయితీలు: ఏపీలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్‌తో చిరంజీవి చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం జగన్ కూడా సానుకూలంగా ఉన్న నేపథ్యంలో... ఇండస్ట్రీ పెద్దగా ఉన్న చిరంజీవి ఈ అంశంపై సీఎం జగన్‌తో చర్చలు జరపొచ్చని తెలుస్తోంది. వీటితో పాటు మరికొన్ని అంశాలు ఇరువురి భేటీలో చర్చకు రానున్నాయి.

Comments