Skip to main content

1993లో తన తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్న ఒవైసీ



1993లో ఓ వ్యక్తికి ఇచ్చిన మాటను హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఇప్పటికీ నిలబెట్టుకుంటున్నారు. ప్రస్తుతం అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్న విషయం తెలిసిందే. తన తండ్రి అప్పట్లో ఇచ్చిన మాట ప్రకారం అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టులో ముస్లింల తరఫు కక్షిదారు జఫర్యాబ్‌ జిలానీ తాత్కాలికంగా ఉండేందుకు ఢిల్లీలోని తన నివాసాన్ని ఒవైసీ ఇచ్చారు.

లక్నో వాసి జిలానీకి సుప్రీంకోర్టులో వాదనల సమయంలో వచ్చినప్పుడు ఢిల్లీలో ఎక్కడ ఉండాలో తెలియక ఇబ్బందులు పడేవారు. అయితే, ఈ కేసుకు సంబంధించి ఢిల్లీకి ఎప్పుడొచ్చినా తన ఇంట్లో ఉండాలంటూ ఆయనకు సుల్తాన్‌ సలావుద్దీన్‌ అప్పట్లో ఓ గది కేటాయించారు. సలావుద్దీన్‌ చనిపోయినప్పటికీ జిలానీకి అసదుద్దీన్ ఆ గదిలో వసతి కల్పిస్తున్నారు.

జిలానీ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంపై స్పందించారు. 26 ఏళ్లుగా తాను ఢిల్లీ వచ్చినప్పుడు అసద్‌ నివాసంలోనే ఉంటున్నానని తెలిపారు. అంతేగాక, తనకు భోజనాన్ని కూడా అందిస్తున్నారని వివరించారు. కాగా, అయోధ్యలో వాదనల పూర్తికి ఈ రోజు సాయంత్రం వరకు సుప్రీంకోర్టు గడువు విధించిన విషయం తెలిసిందే. ముస్లిం కక్షిదారులు వాదనలు వినిపించేందుకు ఈ రోజు గంట సమయం కేటాయించారు.

Comments