Skip to main content

టీఎస్ ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు విచారణ నవంబర్ 1కి వాయిదా


 

తెలంగాణ హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై కొనసాగుతున్న విచారణ మరోసారి వాయిదా పడింది. ఆర్టీసీ యాజమాన్యం, కార్మికనేతల మధ్య చర్చల నేపథ్యంలో నిన్న విచారణ ప్రారంభించిన కోర్టు తదుపరి విచారణను ఈరోజుకు వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా కోర్టు విచారణను నవంబర్ 1కి వాయిదా వేసినట్లు ప్రకటించింది. కార్మికులకు బకాయి పడ్డ మొత్తానికి సంబంధించిన వివరాలను ఈ నెల 31లోపు కోర్టుకు తెలపాలని ఆర్టీసీ ఎండీని ఆదేశించింది. ఆర్టీసీలో ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించే అధికారి కూడా నవంబర్ 1న జరిగే విచారణకు హాజరు కావాలని తెలిపింది.

మరోవైపు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించినట్లు చెపుతున్న రూ.4,253 కోట్లలో రీయింబర్స్ మెంట్ బకాయిలు ఉన్నాయా? అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అలాగే జీహెచ్ఎంసీ తాను చెల్లించాల్సిన రూ.335 కోట్లను చెల్లించిందా? అన్న విషయాన్ని ఆర్టీసీ యాజమాన్యం తెలపాలని ఆదేశించింది. తాను ఇస్తున్న వివరాలను పరిశీలించకుండానే ఆర్థికశాఖ కార్యదర్శి కోర్టుకు నివేదిక సమర్పించడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.  

Comments