టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. గ్రామ సచివాలయ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించినా ఆరోపణలు చేయడం అర్థరహితమని అన్నారు. 300 అడుగుల లోతున గోదావరిలో మునిగిన బోటును వెలికితీయడం కష్టంగా మారిందని, దాన్ని కూడా ప్రభుత్వ అసమర్థత కింద విమర్శలు చేయడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాల్లో 30 మంది చనిపోతే అది చంద్రబాబు అసమర్థతేనా? అని ప్రశ్నించారు. దురదృష్టకర ఘటనలను చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Post a Comment