Skip to main content

బ్రేకింగ్: సైరాకు హైకోర్టులో షాక్.. ఏం జరగబోతోంది!

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబర్ 2న విడుదలకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటోంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మాతగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పెద్దఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఉయ్యాలవాడ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇదిలా ఉండగా ఈ చిత్రంపై ఉయ్యాలవాడ కుటుంబీకులు గత కొన్నిరోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఉయ్యాలవాడ కుటుంబీకులు ఇటీవల సైరా చిత్రంపై.. చిరంజీవి, రాంచరణ్ పై హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. ఈ పిటిషన్ పై విచారణ చేస్తున్న నేపథ్యంలో సెన్సార్ డైరెక్టర్ కోర్టుకు షాకింగ్ విషయాన్ని తెలియజేశారు. సైరా చిత్రానికి ఇంకా సెన్సార్ పూర్తి కాలేదని అన్నారు. చిత్ర యూనిట్ కి ఇంకా సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయలేదని అన్నారు.

సైరా నరసింహారెడ్డి చిత్రం బయోపిక్ కాదని చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి కోర్టుకు తెలిపారు. సైరాపై తమ నిర్ణయాన్ని ఈ నెల 30 లోగ చెబుతామని కోర్టుకు సెన్సార్ బోర్డు తెలిపింది. ఇదిలా ఉండగా తదుపరి విచరణని కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు, సెన్సార్ బోర్డు సైరాపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో అని అభిమానుల్లో ఆందోళన మొదలయింది.

తమ అనుమతి లేకుండా సైరా చిత్రాన్ని నిర్మించి విడుదల చేసుకుంటున్నారని నరసింహారెడ్డి కుటుంబసభ్యులు కొన్నిరోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వివాదంపై రాంచరణ్ గతంలో వివరణ ఇచ్చారు. 100 సంవత్సరాలు దాటిన తర్వాత ఓ చరిత్ర కారుడి జీవితం చరిత్ర అవుతుంది. సుప్రీం కోర్టు నిబంధనలు కూడా ఉన్నాయి అని రాంచరణ్ తెలిపిన సంగతి తెలిసిందే.

Comments