Skip to main content

చంద్రబాబు చేతికి ‘మూడు కత్తులు’ ఇచ్చిన సీఎం జగన్

Jagan vs Babu | చంద్రబాబు చేతికి ‘మూడు కత్తులు’ ఇచ్చిన సీఎం జగన్– News18 Telugu
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడికి బలం పుంజుకోవడానికి టానిక్ అందిస్తున్నారా? గత కొన్ని రోజులుగా వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయాలు అందుకు ఊతమిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబునాయుడు హయాంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలకు మంగళం పాడడంతోపాటు కరకట్ట మీద ఉన్న నివాసాన్ని కూలగొట్టడానికి జగన్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం వంటివి పరిశీలిస్తే అవన్నీ చంద్రబాబుకు కలసివచ్చేలా ఉన్నాయని భావిస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీకి సంబంధించి చివరి రెండు విడుతల చెక్కులకు జగన్ చెక్ పెట్టారు. 4, 5 విడతల్లో ఇవ్వాల్సిన రూ.7959.12 కోట్లను నిలుపుదల చేశారు. సెప్టెంబర్ 25న దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వం కొత్తగా వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని అక్టోబర్ 15 నుంచి అమలు చేస్తుంది. కాబట్టి, పాతదాన్ని రద్దు చేశామని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే, సహజంగా రైతులు దేనికదే అనే భావనలో ఉంటారు. రుణమాఫీ హామీ ఐదేళ్ల క్రితం నాటిది. రైతు భరోసా ఎన్నికల ముందు నాటిది. ఎప్పుడో ఐదేళ్ల క్రితం నాటి హామీకి సంబంధించిననిధులు చివరి నిమిషంలో నిలిపివేస్తే అటు రైతులు, ఇటు ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద విమర్శలు ఎక్కుపెట్టే అవకాశం ఉంది.
ఇక కరకట్ట మీద చంద్రబాబు ఉంటున్న నివాసం ఖాళీ చేయాలని జగన్ ప్రభుత్వం నోటీసు ఇచ్చింది. చంద్రబాబు ఇంటి విషయంలో జగన్ మోహన్ రెడ్డి మరీ వ్యక్తిగతంగా తీసుకుంటున్నారని, కక్షగట్టి ఇల్లు కూల్చేదాకా వదిలిపెట్టేలా లేరనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లింది. అది టీడీపీ ప్రచారం వల్ల అయినా కావొచ్చు. వైసీపీ ప్రభుత్వం దూకుడు వల్ల అయినా కావొచ్చు. జగన్ పర్సనల్ అజెండాను అమలు చేస్తున్నారని టీడీపీ ప్రచారం చేసుకోవడానికి ఓ అవకాశాన్ని సీఎం కల్పిస్తున్నారు. వీటితోపాటు ఇటీవల పల్నాడులో వైసీపీ బాధిత శిబిరానికి వెళ్లడానికి ప్రయత్నించిన చంద్రబాబును హౌస్ అరెస్ట్ చేయడం వంటివి కూడా టీడీపీ మీద ప్రజల్లో సానుకూలత, పాజిటివ్ అభిప్రాయాన్ని కల్పించే అవకాశాన్ని ఇచ్చేవే. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలే. ఇలాంటి నిర్ణయాలే... కేవలం 23 సీట్లతో చతికిలపడిన టీడీపీ మళ్లీ పుంజుకోవడానికి దారి చూపిస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  అక్టోబర్ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇలాంటి సమయంలో చర్చనీయాంశమైనవి, దుమారాన్ని రేకెత్తించే నిర్ణయాలతో జగన్ మోహన్ రెడ్డి టీడీపీకి ఫుల్ టానిక్ ఇస్తున్నారనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.

Comments

Popular posts from this blog

రేపు బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధికి సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ రేపు దసరా ఉత్సవాల్లో పాల్గొననున్నారు. శుక్రవారం సాయంత్రం ఇంద్రకీలాద్రికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకోనున్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం హోదాలో కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ మేరకు జగన్ షెడ్యూల్ లో మార్పులు చేశారు. ఎల్లుండి ఆయన ఢిల్లీ వెళుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త షెడ్యూల్ ప్రకారం, ప్రకాశం బ్యారేజ్ మీదుగా సీఎం అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ఆలయ ప్రాంగణంలోని ఓంకారం వద్ద రాష్ట్ర మంత్రులు సీఎంకు స్వాగతం పలుకుతారు. ఆపై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. కాగా, సీఎం జగన్ అమ్మవారిని దర్శించుకునే సమయంలో వీఐపీ క్యూలైన్లను నిలిపివేస్తారు. సాధారణ, రూ.100 క్యూలైన్లు మాత్రం నడుస్తాయి. ఇక జగన్ పర్యటన సందర్భంగా ఘాట్ రోడ్డుపైకి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఎలాంటి వాహనాలను అనుమతించరు.

ఈ ప్రాజెక్టు ఏపీ పునర్విభజన చట్టం పరిధిలోకి రాదు: రేవంత్ రెడ్డి

  కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తాజాగా కృష్ణా నది యాజమాన్య బోర్డు చైర్మన్ పరమేశంను కలిసి నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంపై వినతిపత్రం ఇచ్చారు. హైదరాబాదులోని జలసౌధ కార్యాలయానికి వెళ్లిన రేవంత్ రెడ్డి, జీవో 69 ద్వారా మంజూరు చేసిన నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను అపెక్స్ కౌన్సిల్ అజెండాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం ఉమ్మడి రాష్ట్రంలో అన్ని అనుమతులు పొందిందని, ఎంతో తక్కువ ఖర్చుతో నికర జలాలను ఇవ్వగలిగిన ఈ ప్రాజెక్టును తొక్కిపెట్టి మీరు సాధించిందేమిటి? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో మీరు వేసిన కేసులోనూ ఈ ప్రాజెక్టు వివరాలు పొందుపరచకపోవడం మీ దుర్మార్గానికి పరాకాష్ఠ అంటూ మండిపడ్డారు. అంతేకాదు, ఈ ప్రాజెక్టు ఏపీ పునర్విభజన చట్టం పరిధిలోకి రాదని, పొరుగు రాష్ట్రాలేవీ దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని రేవంత్ స్పష్టం చేశారు.