గత పదేళ్లుగా రాష్ట్రంలో కరువు తాండవించిందనీ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మంచి వర్షాలు పడుతున్నాయని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని పాలించే రాజును బట్టి ప్రకృతి సహకరిస్తుందని బుగ్గన వెల్లడించారు. ఆదివారం ఎమ్మిగనూరులో పర్యటించిన మంత్రి.. కరకట్టపై అక్రమంగా ఇల్లు కట్టి ఇంట్లోకి నీళ్లొచ్చాయనడం సరికాదని చంద్రబాబునుద్దేశించి విమర్శించారు. గత ప్రభుత్వం బడా కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించి చిన్న కాంట్రాక్టర్లకి చెల్లింపులు నిలిపివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, రెవిన్యూ రికార్డులను తారుమారు చేసిందనీ, రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎన్ని నిధులైనా ఖర్చు పెడుతుందని హామీ ఇచ్చారు. మరోవైపు ఎన్ని సమస్యలున్నా అక్టోబర్ 15న రైతు భరోసా పథకాన్ని అందిస్తామని స్పష్టం చేశారు.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Post a Comment