రైతు రుణమాఫీకి ఇచ్చిన జీవోను రద్దు చేయడం దారుణమని, ఏ ప్రభుత్వం ఉన్న నడుస్తున్న పథకాలను కొనసాగించాలని టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. జగన్ ప్రభుత్వం నిన్న రద్దు చేసిన జీవో 38పై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు మీద కోపంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబుకు అసలు వ్యవసాయం పట్ల అవగాహన ఉందా? అని ప్రశ్నించారు. తమ హయాంలో మొత్తం 14,124 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు. వంద రోజుల తర్వాత కూడా చంద్రబాబు పాలన గురించి మాట్లాడుతున్నారని.. అసలు వైసీపీ పాలన ఏంటో చెప్పాలని అయ్యన్న డిమాండ్ చేశారు.
ప్రభుత్వం లోపాలను ఎత్తి చూపిస్తే ప్రతిపక్షం విమర్శలు చేస్తోందని అంటూ.. వైసీపీ నేతలు తిరిగి విమర్శలు చేస్తున్నారని అయ్యన్న మండిపడ్దారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే నాలుకలు, పీకలు కోస్తామని బెదిరిస్తున్నారని, వారి బెదిరింపులకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలకు కోపం వస్తే గొంతు పిసికి చంపేస్తారన్నారు. వైసీపీ నేతలు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని అయ్యన్న హెచ్చరించారు. అవంతి శ్రీనివాస్ మంచి వ్యక్తి, ఆయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. సుజల స్రవంతి టెండర్ రద్దు చేస్తుంటే ఆయన ఎందుకు అడ్డు చెప్పలేకపోయారని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు.
Comments
Post a Comment