తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్. బోటు ప్రమాదంపై నివేదిక వచ్చిన తర్వాత చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
బోటు నిర్వాహకుడు కోడిగుట్ల వెంకటరమణ తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడు అని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే బోటుకు అనుమతి వచ్చినట్లు అవంతి స్పష్టం చేశారు.
ఇకపోతే గోదావరిపుష్కరాల సమయంలో నాటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాదానికి గురైన శ్రీవశిష్ఠ పున్నమి రాయల్ టూరిస్ట్ బోటులోనే ప్రయాణించారని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ హయాంలో టీడీపీ వాళ్లు బోటును ప్రారంభించి అందులో పార్టీ అధినేత చంద్రబాబు కూడా ప్రయాణించారని తీరా తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
తనకు బోటు వ్యాపారాలు ఉన్నాయంటూ ఆరోపిస్తున్నారని అదంతా కేవల దుష్ప్రచారం మాత్రమేనని చెప్పుకొచ్చారు. బోటు బాధితులకు ప్రభుత్వమే నష్టపరిహారం అందిస్తుందని హామీ ఇచ్చారు. సైబర్ నేరగాళ్లతో బాధితులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Comments
Post a Comment