వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు తప్ప ప్రజా పాలన అందించడం లేదని, టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ పై అక్రమంగా కేసు పెట్టారని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ప్రభుత్వ కార్యాలయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ కూన రవికుమార్ తో పాటు మరో 11 మంది వ్యక్తులపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో మాజీ హోంమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ… కూన రవికుమార్ పై అక్రమంగా కేసు పెట్టారని ఆరోపించారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు రవిని కలిశామని, వైసీపీ ప్రభుత్వానికి కక్ష సాధింపులు తప్ప సంక్షేమం పట్టదని విమర్శించారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావును ప్రభుత్వమే పొట్టనపెట్టుకుందని చినరాజప్ప ఆరోపించారు.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Comments
Post a Comment