వైఎస్ వివేకా హత్య కేసును నీరుగార్చాలని చూస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత ఆలపాటి రాజా ఆరోపణలు గుప్పించారు. వివేకా హత్యపై వైసీపీ ఎన్నో రాజకీయాలు చేసిందని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ కేసు దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేదని విమర్శించారు. వివేకా హత్య కేసు విచారణపై నాడు తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ప్రస్తుత ప్రభుత్వానికి లేదని, ఇందుకు జగనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పాలనను, శాంతి భద్రతలను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో విద్యుత్ కొరత లేకుండా చూశామని, జగన్ పాలనలో రాష్ట్రాన్ని అంధకారంగా మారుస్తున్నారని విమర్శలు చేశారు.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Post a Comment