Skip to main content

సాక్షిగా పిలిచారు, మళ్లీ రమ్మనలేదు: వోక్స్ వ్యాగన్ కేసుపై మంత్రి బొత్స

ap municipal minister botsa satya narayana reacts to attending cbi court
వోక్స్ వ్యాగన్ కేసులో తనను  కేవలం సాక్షిగానే విచారణకు పిలిచారని స్పష్టం చేశారు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఇటీవలే తనకు సమన్లు అందజేశారని సాక్షిగా స్టేట్మెంట్ రికార్డు చేసుకునేందుకు హాజరుకావాలని కోరారని అందులో భాగంగా సీబీఐ కోర్టుకు హాజరైనట్లు తెలిపారు. 
వోక్స్ వ్యాగన్ కేసు విచారణలో భాగంగా తనను 60వ సాక్షిగా పిలిచారని చెప్పుకొచ్చారు. తన స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారని తెలిపారు. అయితే మళ్లీ విచారణకు హాజరుకావాలా వద్దా అనేది సీబీఐ అధికారులు గానీ కోర్టు గానీ చెప్పలేదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. 
2005లో దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో బొత్స సత్యనారాయణ భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలో జర్మనీకి చెందిన వోక్స్ వ్యాగన్ కుంభకోణం జరిగింది. ఈ కుంభకోణంలో 11 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడినట్లు సీబీఐ అభియోగాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 
ఈ కేసులో బొత్స సత్యనారాయణపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇకపోతే ఇప్పటి వరకు సీబీఐ 3వేల పేజీల చార్జిషీట్ దాఖలు చేసింది. ఇప్పటి వరకు 59 మందిని విచారించగా తాజాగా బొత్స సత్యనారాయణను విచారించింది.  

Comments