ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేశారు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రకి ఆర్కే సింగ్. ఏపీ హైకోర్టు, కేంద్రం ప్రభుత్వం పలుమార్లు పీపీఏలపై సమీక్ష వద్దని చెప్పినా వైయస్ జగన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు.
పీపీఏల ఒప్పందాల్లో ఎలాంటి అవినీతి జరగలేదంటూ సీఎం జగన్ కు లేఖ రాశారు. పీపీఏల విషయంలో చంద్రబాబుపై ప్రధానికి జగన్ ఫిర్యాదు చేసిన అంశంపై కూడా లేఖలో ప్రస్తావించారు. డిస్కంల నష్టానికి అధిక టారిఫ్‌లే కారణమంటున్న జగన్ నిర్ణయాన్ని కేంద్రమంత్రి ఆర్కే సింగ్ తప్పుబట్టారు.
డిస్కంలు నష్టాల్లో ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయని అంతేగానీ దానికి టారిఫ్ లే కారణం కాదన్నారు. ఐదు రాష్ట్రాల్లో పీపీఏలకు ఇంతకంటే అధిక ధరలు చెల్లిస్తున్నారని లేఖలో స్పష్టం చేశారు. పీపీఏల టారిఫ్‌ల నిర్ణయం గాలివేగం, సౌర, థార్మికత, ప్లాంట్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని లేఖలో పేర్కొన్నారు.
టీడీపీ ప్రభుత్వం మూడు కంపెనీలకే 70 శాతం కేటాయింపులు చేశారంటూ చేస్తున్న వాదనల్లో ఏమాత్రం నిజంలేదన్నారు. కొన్ని కంపెనీలు మిగతా కంపెనీలను టేకోవర్ చేయడం వల్లే విద్యుత్ ఉత్పాదకత పెంచుకున్నాయని స్పష్టం చేశారు.
ప్రస్తుతం థర్మల్ పవర్ రూ.4.20 పైసలకే వస్తోందని ఆర్కే సింగ్ లేఖలో స్పష్టం చేశారు. కానీ 20 సంవత్సరాల తర్వాత యూనిట్ ధర రూ.22 అవుతుందని తెలిపారు. పవన విద్యుత్ ఎప్పుడూ రూ.4.80కే లభిస్తుందన్నారు. పీపీఏలపై పునఃసమీక్ష, చేస్తున్న ఆరోపణలు సాంప్రదాయేతర విద్యుత్ రంగాల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని కేంద్ర మంత్రి ఆర్కేసింగ్ తన లేఖలో పేర్కొన్నారు.
Comments
Post a Comment