ఏపీ సీఎం వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు రద్దు చేశారు. 30 ఏళ్ల పాటు ఏపీఎండీసీ (ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ)కి ఇచ్చిన బాక్సైట్ అనుమతులను రద్దు చేస్తూ గురువారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాక్సైట్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తామని రెండేళ్ల క్రితమే విశాఖ మన్యంలోని గిరిజనులకు మాటిచ్చారు జగన్. ఎన్నికల ప్రచారంలోనూ దీనికి సంబంధించి హామీ ఇచ్చారు. ఆ హామీని అమల్లోకి తెస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్.ప్రభుత్వ ఉత్తర్వులతో అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్, జెర్రెల బ్లాక్ 1,2,3, గాలిగొండ, చిత్తమగొండి, రక్తకొండ గ్రామాల్లో బాక్సైట్ తవ్వకాలను నిలిచిపోనున్నాయి. సీఎం జగన్ నిర్ణయంపై విశాఖ మన్యంలోని గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏన్నో ఏళ్ల తమ పోరాటానికి ఫలితం దక్కిందని చెప్పారు.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Comments
Post a Comment