విశాఖ, విజయవాడ ప్రజలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న డబుల్ డెక్కర్ రైలు ప్రారంభమైంది. ఈ రోజు రైల్వే సహాయ మంత్రి సురేశ్ చెన్నబసప్ప అంగడి పచ్చ జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు. దీంతో ఉదయం 11 గంటల 30 నిమిషాలకు విశాఖపట్నం రైల్వేస్టేషన్ 1వ నంబరు ప్లాట్‌ఫామ్‌పై నుంచి రైలు దూసుకెళ్లింది. ఈ రైలులో విశాఖ టు విజయవాడకు టికెట్ ధర రూ.525గా నిర్ణయించారు. కాగా, శుక్రవారం నుంచి దీని సర్వీసులు పూర్తిస్థాయిలో పట్టాలెక్కనున్నాయి.వాస్తవానికి ఈ రైలును ఆగస్టు 26న ప్రారంభించాల్సి ఉండగా.. కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మరణంతో వాయిదా వేశారు. ఇటీవల ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో విజయవాడ, వైజాగ్ మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది భారతీయ రైల్వే. విశాఖపట్నం, విజయవాడ మధ్య డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్‌ప్రెస్(22701) దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి రైల్వేస్టేషన్లల్లో ఆగుతుంది. ఉదయ్ ఎక్స్‌ప్రెస్ ప్రతీ రోజూ వైజాగ్‌లో ఉదయం 5.45 గంటలకు బయల్దేరుతుంది. ఉదయం 11.15 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. ఉదయ్ ఎక్స్‌ప్రెస్ ప్రతీ రోజూ సాయంత్రం 5.30 గంటలకు విజయవాడలో బయల్దేరి, రాత్రి 11 గంటలకు విశాఖపట్నానికి చేరుకుంటుంది. విశాఖ, విజయవాడ మధ్య రాకపోకలు ఎక్కువగా ఉండటంతో ఉదయ్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఉదయ్ ఎక్స్‌ప్రెస్ సోమవారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం, శనివారం రోజుల్లోనే అందుబాటులో ఉంటుంది. మొదటి ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌ను గతేడాది జూన్ నుంచి కొయంబత్తూర్-బెంగళూరు మధ్య నడుపుతోంది భారతీయ రైల్వే. ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రత్యేకతలెన్నో..
ఈ రైలులో మొత్తం 9 ఏసీ కోచ్‌లు, 2 పవర్ కార్స్ ఉంటాయి. ప్రతీ కోచ్‌లో 120 సీట్ల కెపాసిటీ ఉంటుంది. అప్పర్ డెక్‌లో 50, లోయర్‌డెక్‌లో 48, చివర్లో 22 మంది కూర్చోవచ్చు. మూడు కోచ్‌లల్లో డైనింగ్ ఫెసిలిటీ ఉంటుంది. అందులో ప్రతీ కోచ్‌లో 104 ప్రయాణికులు కూర్చోవచ్చు. 5 కోచ్‌లల్లో డైనింగ్ ఫెసిలిటీ ఉండదు. మెత్తని సీట్లు, కళ్లుచెదిరే ఇంటీరియర్, డిస్‌ప్లే స్కీన్స్, వైఫై, మాడ్యులర్ బయో టాయిలెట్స్, స్మోక్ డిటెక్షన్ అలారమ్ సిస్టమ్ ఉదయ్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకత.
Comments
Post a Comment