రసవత్తరం అవుతాయి అనుకున్న కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికలు వాయిదా పడ్డాయి. కాంగ్రెస్-జేడీఎస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు జారీ చేసిన ఉప ఎన్నికల నోటిఫికేషన్ ను కేంద్ర ఎన్నికల సంఘం వెనక్కు తీసుకుంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలు తమపై పడ్డ అనర్హత వేటు విషయంలో కోర్టుకు ఎక్కిన నేపథ్యంలో, వారి పిటిషన్ ను కోర్టు విచారిస్తున్న తరుణంలో.. ఉప ఎన్నికలను వాయిదా వేయాలని వారు కోరగా, ఆ మేరకు ఈసీ నిర్ణయం తీసుకుంది.
అనర్హత వేటుపడ్డ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఏమాత్రం లేటు చేయకుండా ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడమే ఆశ్చర్యకరంగా అనిపించింది. అది భారతీయ జనతా పార్టీకి గట్టి ఝలక్ అని పరిశీలకులు భావించారు. ఇప్పట్లో ఉప ఎన్నికలు వచ్చి,ఆ స్థానాలను బీజేపీ సొంతం చేసుకోకపోతే, కాంగ్రెస్-జేడీఎస్ లు ఆ స్థానాలను నెగ్గితే యడియూరప్ప ప్రభుత్వం మైనారిటీలో పడే అవకాశాలున్నాయి.
మళ్లీ కాంగ్రెస్- జేడీఎస్ ల నుంచి ఎమ్మెల్యేలను తెచ్చుకుని.. ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అనర్హత వేటుపడ్డ వారి పై ప్రజలు కూడా అదే అనర్హత వేస్తే అంతే సంగతులు. అందుకే ఇప్పుడే ఉప ఎన్నికలు రావడం బీజేపీకి ఝలక్ అయ్యే అవకాశాలు కనిపించాయి.
అయితే ఇప్పుడు ఈసీ ఉప ఎన్నికలను వాయిదా వేసింది. అనర్హత వేటుపడ్డ ఎమ్మెల్యేల పోటీ విషయంలో కోర్టు తీర్పు వచ్చే వరకూ అక్కడ బై పోల్స్ ను ఈసీ వాయిదా వేసింది. ఇలా వారికి ఊరట లభించింది. ఇంతకీ వారి పోటీపై కోర్టు ఏం తేలుస్తుందో, వారిపై అసలు అనర్హత వేటే చెల్లదని కోర్టు తీర్పును ఇచ్చి, ఉప ఎన్నికల భయమే లేకుండా చేస్తుందో.. ఈ ప్రజాస్వామ్య చిత్రవిచిత్రం ఎలా ఉంటుందో!
Comments
Post a Comment