ముచ్చటగా మూడోసారి సమావేశమైన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖ్యంగా, గోదావరి జలాల వినియోగంపై చర్చించారు. గోదావరి బ్యాక్ వాటర్‌ను నాగార్జునసాగర్, శ్రీశైలానికి తరలించడం ద్వారా ఇటు తెలంగాణ, అటు రాయలసీమకు నీళ్లందించాలన్న ప్రతిపాదనపై దాదాపు నాలుగున్నర గంటలపాటు డిస్కషన్స్ చేశారు. గోదావరి జలాలను నాగార్జునసాగర్, శ్రీశైలానికి తరలించడం ద్వారా, తెలంగాణలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు.... ఏపీలో రాయలసీమకు తాగు-సాగునీరు అందించాలని భావిస్తున్నారు. గోదావరి జలాల తరలింపుపై ప్రధానంగా నాలుగు మార్గాలను ప్రతిపాదించారు. అయితే, అందులో వైకుంఠపురం నుంచి పులిచింతల... అక్కడ్నుంచి నాగార్జునసాగర్, శ్రీశైలానికి తరలించడమే ఇరురాష్ట్రాలకు ఉత్తమ మార్గమని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఒక్క మార్గంలో మాత్రమే, కొంతలో కొంత తక్కువ వ్యయంతో గోదావరి జలాల తరలింపు చేపట్టవచ్చని అంచనాకి వచ్చారు. వైకుంఠపురం టు నాగార్జునసాగర్, శ్రీశైలం మార్గంలో గోదావరి జలాల తరలింపు చేపట్టడానికి ప్రాథమికంగా 40వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని లెక్కగట్టారు.
ఇక, విభజన సమస్యలు, 9, 10 షెడ్యూల్ సంస్థల విభజన, ఆస్తుల పంపకాలపైనా కేసీఆర్, జగన్ చర్చించారు. అలాగే, విజయవాడలోని ఆప్మెల్ ఆస్తుల పంపకాలు, ఢిల్లీలో ఏపీ భవన్ విభజనపైనా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు, తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్రం పక్షవాత వైఖరి చూపుతోందని కేసీఆర్, జగన్ అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. అంతేకాదు, రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ బలపడటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నందున... కాషాయదళాన్ని కలిసి ఎదుర్కోవాలని కేసీఆర్-జగన్ నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.
Comments
Post a Comment