పర్చూరులో దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు చెక్ పెట్టే దిశగా వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ పావులు కదుపుతున్నారా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు పార్టీకి గుడ్‌బై చెప్పిన రావి రామనాథంబాబును జగన్ స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన చేరిక విషయంపై దగ్గుబాటికి కనీస సమాచారం కూడా లేదని తెలుస్తోంది. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ల సమక్షంలో రామనాథంబాబును పార్టీలో చేర్చుకున్నారు. నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిగా ఉన్న దగ్గుబాటి అక్కడ కనిపించలేదు. ఈ చేరిక విషయంలో దగ్గుబాటితో చర్చించిన దాఖలాలు కూడా లేవంటున్నారు.
గత ఫిబ్రవరి వరకూ పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా పని చేసిన రామనాథంబాబు.. ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. కుమారుడితో కలిసి దగ్గుబాటి వైసీపీలో చేరడం, దగ్గుబాటికి టికెట్ కేటాయించడంతో.. రామనాథంబాబు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఆయన చేరికతో.. టీడీపీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావుకు కొంత బలం వచ్చింది. దాంతో ఆయన విజయం సాధించారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు రామనాథంబాబును స్వయంగా జగన్ కండువాకప్పి పార్టీలో చేర్చుకోవడం చర్చనీయాంశమైంది. నిజానికి ఇప్పటికిప్పుడు రామనాథంబాబును పార్టీలోకి తీసుకోవాల్సిన అవసరాలు ఏమీ లేవు. దీంతో.. ఎన్నికలలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన రామనాథంబాబును తిరిగి ఇంత ప్రాధాన్యత ఇచ్చి పార్టీలో చేర్చుకోవడంలో ఆంతర్యమేమిటన్న ప్రశ్న రాజకీయవర్గాలలో ఉత్పన్నమవుతోంది. దగ్గుబాటికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతోనే రామనాథం బాబును పిలిచి మరీ పార్టీలో చేర్చుకున్నారని అంటున్నారు.
ఇటీవల బీజేపీ నేతలు వైసీపీ సర్కార్ పై విరుచుకుపడుతున్నారు. బీజేపీలో రాష్ట్ర నాయకురాలిగా ఉన్న దగ్గుబాటి సతీమణి పురందేశ్వరి కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మరోవైపు స్థానికంగా పార్టీశ్రేణులను దగ్గుబాటి ఏమాత్రం పట్టించుకోవడం లేదని కొందరు ఫిర్యాదు చేశారట. ఈ నేపథ్యంలో జగన్ దగ్గుబాటిని దూరం పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే రామనాథంబాబుని తిరిగి పార్టీలోకి చేర్చుకొని దగ్గుబాటికి పొమ్మనకుండా పొగపెడుతున్నారని అంటున్నారు. అంతేకాదు త్వరలోనే రామనాథంబాబుని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించినా ఆశ్చర్యం లేదని ప్రచారం జరుగుతోంది. మరి దగ్గుబాటికి జగన్ నిజంగానే చెక్ పెడుతున్నారా? అదే జరిగితే దగ్గుబాటి ఏం చేస్తారు?. తాను కూడా బీజేపీలో చేరతారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బీజేపీ ఏపీలో బలపడాలని చూస్తోంది. ఇప్పటికే పలువురు నేతలను చేర్చుకుంది. ఈ నేతల జాబితాలో దగ్గుబాటి కూడా చేరొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దగ్గుబాటి సతీమణి పురందేశ్వరి బీజేపీలో ఉన్నారు. తాను కూడా బీజేపీలో చేరితే కుటుంబమంతా ఒకే పార్టీలో ఉన్నట్టుంటుందన్న ఆలోచనలో దగ్గుబాటి ఉన్నట్లు తెలుస్తోంది. చూద్దాం మరి పర్చూరు వైసీపీ రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో.
Comments
Post a Comment