Skip to main content

ఉగ్ర‌వాదుల‌కు పెన్ష‌న్ ఇస్తున్న‌దెవ‌రు ?




ఐక్యరాజ్య‌స‌మితి నిషేధిత జాబితాలో ఉన్న ఉగ్ర‌వాదుల‌కు పాకిస్థాన్ నెల‌నెల పెన్ష‌న్ ఇస్తున్న‌ద‌ని భార‌త్ ఆరోపించింది. యూఎన్‌లో పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్ర‌సంగాన్ని భార‌త్ ఖండించింది. యూఎన్ లిస్టులో ఉన్న ఉగ్ర‌వాదుల‌కు పెన్ష‌న్ ఇస్తున్న ఏకైక దేశం పాకిస్థాన్ అని భార‌త విదేశాంగ కార్య‌ద‌ర్శి విదిశా మైత్రా తెలిపారు. ఆల్‌ఖ‌యిదా, దాయిశ్ సంస్థ‌ల‌కు నిధులు ఇవ్వ‌కూడ‌దని యూఎన్ ఆంక్ష‌లు విధించినా.. పాక్ మాత్రం ఆ సంస్థ ఉగ్ర‌వాదుల‌ను ఆదుకుంటోంద‌ని విదిశా తెలిపారు. ఇమ్రాన్ ప్ర‌సంగానికి ఐక్య‌రాజ్య‌స‌మితి వేదిక‌గా భార‌త్ రిప్లై ఇచ్చింది. అణుయుద్ధం వ‌స్తుంద‌ని హెచ్చ‌రించిన ఇమ్రాన్ వ్యాఖ్య‌లు ఆ దేశం అనుస‌రిస్తున్న ప్ర‌మాద‌క‌ర విధానాన్ని మాత్రం స్ప‌ష్టం చేస్తున్న‌ద‌ని, దాంట్లో ఎటువంటి రాజ‌నీతి లేద‌ని భార‌త్ ఆరోపించింది. యూఎన్ బ్యాన్ చేసిన 130 మంది ఉగ్ర‌వాదులు పాక్‌లోనే ఉన్నార‌ని, 25 ఉగ్ర సంస్థ‌లు కూడా అక్క‌డే ఉన్నాయ‌ని, దీన్ని ఆ దేశం అంగీక‌రిస్తుందా అని విదిశా ప్ర‌శ్నించారు. చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించి చెప్ప‌డం కాదు అని, 1971లో స్వంత ప్ర‌జ‌ల‌ను ఊచ‌కోత కోసిన తీరును ఇమ్రాన్ గుర్తు చేసుకోవాల‌ని భార‌త్ పేర్కొన్న‌ది. జెంటిల్మెన్ గేమ్‌గా పిలువ‌బ‌డే క్రికెట్ ఆట‌ను ఆడిన ఇమ్రాన్ ఇప్పుడు త‌మ దేశంలోనే ఆయుధాలు అమ్మే దారా ఆద‌మ్ ఖేల్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ట్లుగా ఉంద‌ని విదిశా నిల‌దీశారు. పాక్‌లో 1947లో 23 శాతం మైనార్టీలు ఉండేవార‌ని, ఇప్పుడు అక్క‌డ మైనార్టీల సంఖ్య కేవ‌లం 3 శాతం మాత్ర‌మే ఉంద‌న్నారు.

Comments