Skip to main content

బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి లీగల్ నోటీస్ పంపిన కుటుంబరావు!

ఏపీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) అంశంపై వైసీపీ నేతలు అవినీతి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై ‘టీవీ9’ వేదికగా జరిగిన చర్చా కార్యక్రమంలో ఏపీ ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు కుటుంబరావు, బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో రవిరెడ్డి అనే వ్యక్తి, కుటుంబరావులు మధ్యవర్తులుగా వ్యవహరించారని, అక్రమ ఒప్పందాలు చేశారని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. దీనిపై వెంటనే స్పందించిన కుటుంబరావు ఆ ఆరోపణలను ఖండించారు.

ఇందుకు విష్ణువర్ధన్ రెడ్డి బదులిస్తూ, ఈ ఆరోపణలు తాను చేసినవి కావని, కేంద్రానికి ఏపీ ప్రభుత్వం చేసిన ఫిర్యాదు ఇది అని స్పష్టం చేశారు. ఆ రవిరెడ్డి ఎవరో తనకు తెలియదని, ఆ వ్యక్తితో కలిసి ఉన్న ఒక్క ఫొటో అయినా చూపించాలని, ఈ ఆరోపణలకు సంబంధించి ఏ ఆధారం ఉందో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బురదజల్లే కార్యక్రమానికి పూనుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదన్న కుటుంబరావు, విష్ణువర్ధన్ రెడ్డిపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

అంతేకాదు, విష్ణువర్ధన్ రెడ్డికి ఇప్పటికిప్పుడే తన మొబైల్ ద్వారా వ్యక్తిగత లీగల్ నోటీసును పంపిస్తున్నానని, రేపో, ఎల్లుండో న్యాయపరంగా నోటీసు పంపిస్తానని అన్నారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డికి పంపిన లీగల్ నోటీసును కుటుంబరావు చదివి వినిపించారు.

Comments