ఏపీలో గత ప్రభుత్వ హయాంలో విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతించిన జీవోను వైసీపీ ప్రభుత్వం నిన్న రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ జీవోను తమ హయాంలో రద్దు చేశామని, మళ్లీ ఇప్పుడు రద్దు చేయడమేంటని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. చంద్రబాబునాయుడిని మళ్లీ గోబెల్స్ ఆత్మ ఆవహించిందని, నిజం మాట్లాడటమే మర్చిపోయారని విమర్శించారు. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ 2015 నవంబరు 5న జీవో నంబర్ 97 జారీ చేసింది చంద్రబాబే అని, రద్దయిన జీవోను తిరిగి క్యాన్సిల్ చేయడమేంటని ఆయన ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని అన్నారు.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Post a Comment